నేనే సర్వస్వంగా బతికిన మనిషి .. చివరికి ఇలా , పవిత్ర జయరాం వల్లే : నటుడు చంద్రకాంత్ భార్య

 


రోజుల వ్యవధిలో తెలుగు బుల్లితెరపై విషాదం చోటు చేసుకుంది. గత ఆదివారం కన్నడ నటి, త్రినయని ఫేమ్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఆమె ప్రియుడు , మరో నటుడు చల్లా చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర మరణించిన నాటి నుంచి డిప్రెషన్‌కు గురైన ఆయన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. చంద్రకాంత్‌కు గతంలోనే పెళ్లయి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. గత కొన్నేళ్లుగా తన సహనటి పవిత్ర జయరాంతో రిలేషన్‌లో ఉన్నాడు. 

చంద్రకాంత్ మరణంతో ఆయన సతీమణి శిల్ప కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు ఇలాంటి అఫైర్ ఉంటుందని అస్సలు అనుకోలేదన్నారు. నేనే లోకం, సర్వస్వంగా బతికిన ఆ మనిషి.. ఉన్నపళంగా మారిపోయారని శిల్ప అన్నారు. అది ఎంతలా అంటే తన ముఖం చూస్తేనే అసహ్యం అన్నంతగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదంతా పవిత్రా జయరాం వల్లనేనని ఆమె ఆరోపించారు. తన పరిచయం వల్లే మా ఇద్దరి మధ్య డిస్ట్రబెన్స్‌కు కారణమైందన్నారు. తనకు పాప, బాబు ఉన్నారని.. పవిత్రతో బంధంపై తాను చంద్రకాంత్‌ను నిలదీయగా.. తనతో ఉండలేనంటూ తేల్చిచెప్పారని కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆయనతో చెప్పానని.. పవిత్రను వదిలిపెట్టి మా దగ్గరకే వచ్చేయాలని కోరానని శిల్ప తెలిపారు. రెండు విషయాలు చెప్పి నిర్ణయం అతనికే వదిలేశానని .. ఎప్పుడూ కన్నయ్య, కన్నానే  తప్పించి మరో విధంగా చంద్రకాంత్‌ను పిలవలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 

తమ ఇద్దరిది 11 ఏళ్ల బంధమని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని , షూట్ ప్రారంభమయ్యాక కూడా తనతో ఫోన్‌లో మాట్లాడేవాడని శిల్ప తెలిపారు. అలాంటిది అతనిలో చాలా మార్పులు చోటు చేసుకుని, ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్నారు. ఏది ఏమైనా, ఎక్కడో ఓ చోట చంద్రకాంత్ హ్యాపీగా ఉంటాడని అనుకున్నానని.. ఆయన సంతోషమే తనకు ముఖ్యమని భావించానని శిల్ప చెప్పారు. 

ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని.. పవిత్ర చనిపోయాక ఇక్కడికి వచ్చారని , కానీ తనలో ఏం మాట్లాడలేదని.. నాలుగేళ్లుగా తమ మధ్య మాటలు లేవని ఆమె వివరించారు. మా ఇద్దరి మధ్య పిల్లలు కమ్యూనికేషన్ చేసేశారని.. డైరెక్ట్‌గా తనతో మాట్లాడింది లేదని శిల్ప చెప్పారు.  పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్తే.. అందరం కూర్చోబెట్టి నచ్చజెప్పామని ఆమె వివరించారు. 

తన తల్లి మరణించి ఐదేళ్లు గడిచిందని, ఆ పెయిన్ ఏంటో తనకు తెలుసునని .. అందుకే జరిగిందేదో జరిగింది పిల్లల కోసమైనా ఉండాలని చెప్పానని శిల్ప తెలిపారు. దీనికి నేనెందుకు చస్తాను, చాలా ధైర్యంగా ఉంటా .. పిల్లలను చూసుకోవాలి కదా అని అన్నాడని .. ఆ మాట అన్న 24 గంటల్లోపే ఈ ఘోరం జరిగిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 


Comments